కెనడా నుంచి అమెరికాకు అక్రమ వలసలు.. దోషిగా తేలిన 22 ఏళ్ల భారత యువకుడు

  • కెనడా నుంచి అమెరికాకు అక్రమ వలసల కేసులో శివమ్ నేరాంగీకారం
  • సరిహద్దుల నుంచి వలసదారులను తరలించేందుకు డ్రైవర్లను ఏర్పాటు చేసిన భార‌తీయుడు
  • ఒక్కో వ్యక్తికి 100 డాలర్ల చొప్పున చెల్లించి 12 మందిని అక్రమంగా తరలించిన వైనం
  • నేరం రుజువు కావడంతో 5 నుంచి 15 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం
కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా మనుషులను తరలిస్తున్న స్మగ్లింగ్ రాకెట్‌లో తన ప్రమేయం ఉన్నట్లు 22 ఏళ్ల భారత యువకుడు అంగీకరించాడు. శివమ్ అనే ఈ యువకుడు, భారతీయులతో పాటు ఇతర దేశస్థులను అక్రమంగా యూఎస్-కెనడా సరిహద్దు దాటించడంలో కీలక పాత్ర పోషించినట్లు అమెరికా న్యాయ విభాగం వెల్లడించింది. ఆర్థిక లబ్ధి కోసమే ఈ నేరానికి పాల్పడినట్లు అతను ఒప్పుకున్నాడు.

స్మగ్లింగ్ రాకెట్ పనిచేసింది ఇలా..!
కోర్టు పత్రాల ప్రకారం 2024 అక్టోబర్ నుంచి 2025 జూన్ మధ్య కాలంలో ఈ స్మగ్లింగ్ కార్యకలాపాలు సాగాయి. కెనడా సరిహద్దుల వద్దకు చేరుకున్న వలసదారులను పికప్ చేసుకుని, వారిని ఉత్తర న్యూయార్క్‌లోని రహస్య ప్రదేశాలకు (స్టాష్ హౌస్‌లు), ప్లాట్స్‌బర్గ్‌లోని హోటళ్లకు తరలించడం కోసం డ్రైవర్లను ఏర్పాటు చేయడమే శివమ్ పని. ఇలా ఒక్కో వ్యక్తిని తరలించినందుకు డ్రైవర్లకు అతను డబ్బు చెల్లించేవాడు. ఈ మొత్తం వ్యవహారంలో తన పాత్రకు గాను అతను కూడా పెద్ద మొత్తంలో డబ్బు ఆశించాడు.

2025 జనవరి 25న భారత్, యూకేకు చెందిన 12 మందిని కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా తరలించాలని శివమ్ తన సహచరుడిని ఆదేశించాడు. ఒక్కో వ్యక్తికి 100 డాలర్ల చొప్పున చెల్లించినట్లు న్యాయ విభాగం తెలిపింది. అదే నెలలో సరిహద్దుల సమీపంలో రెండు వాహనాలు అనుమానాస్పదంగా వెళ్తుండగా యూఎస్ బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు ఆపే ప్రయత్నం చేశారు. అయితే, ఆ వాహనాలు వేగంగా తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో ఏజెంట్లు వాటిని వెంబడించారు. ఈ క్రమంలో ఒక వాహనం రోడ్డు పక్కకు దూసుకెళ్లి ఆగిపోగా, మరో వాహనాన్ని న్యూయార్క్‌లోని మూయర్స్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఆ రెండు వాహనాల్లో మొత్తం 12 మంది అక్రమ వలసదారులు ఉన్నట్లు గుర్తించారు.

15 ఏళ్ల వరకు జైలు శిక్ష
ఈ కేసులో విచారణ అనంతరం అక్రమ వలసలకు కుట్ర పన్నడం, ఆర్థిక లాభం కోసం పలువురు వలసదారులను స్మగ్లింగ్ చేయడం వంటి అభియోగాలపై శివమ్ తన నేరాన్ని అంగీకరించాడు. అతనికి ఈ ఏడాది సెప్టెంబర్‌లో శిక్ష ఖరారు చేయనున్నారు. ఈ నేరాలకు గాను కనిష్ఠంగా 5 సంవత్సరాలు, గరిష్ఠంగా 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. యూఎస్ జైలుశిక్ష‌ మార్గదర్శకాలు, ఇతర చట్టపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి తుది శిక్షను నిర్ణయిస్తారు.

Shivam
Canada to US illegal immigration
human smuggling
US border patrol
New York
India
illegal migrants
border crossing
Plattsburgh
smuggling racket

More Telugu News